ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ ముగిసింది.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరిక తర్వాత జీవన్ రెడ్డి అలకబూనిన విషయం తెలిసిందే.. అధిష్టానంతో చర్చల అనంతరం రాజీనామా విషయంలో వెనక్కితగ్గిన జీవన్ రెడ్డి.. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తానని తెలిపారు. ఆ తర్వాత గురువారం ఢిల్లీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.. ఢిల్లీలో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు జీవన్ రెడ్డి.. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్‌రెడ్డికి సరైన సమయంలో సరైన గౌరవం ఇస్తామంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికలో కొంత గందరగోళం ఏర్పడిందని.. ఈ గందరగోళాన్ని అధిష్ఠానం సరిదిద్దే ప్రయత్నం చేసిందన్నారు. జగిత్యాల అభివృద్ధి కోసమే పార్టీలో సంజయ్ చేరారని.. దీంతో జీవన్‌రెడ్డి కొంత మనస్తాపానికి గురయ్యారని.. ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామన్నారు. జీవన్‌రెడ్డికి అధిష్ఠానం హామీ ఇచ్చింది.. హైకమాండ్ ఆదేశాల మేరకు జీవన్‌రెడ్డికి తగిన గౌరవం ఉంటుందని వివరించారు. కాంగ్రెస్‌కి నష్టం జరగాలని కోరుకునే గుంటనక్కలకు జీవన్‌రెడ్డి అవకాశం ఇవ్వలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పథకాల అమలు.. రుణమాఫీ, రైతుభరోసా విషయంలో జీవన్‌రెడ్డి సలహాలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.