ఏపీలోసంక్రాంతికి కోడిపందేల జోరు – కోట్ల రూపాయల బెట్టింగులు..!!

సంక్రాంతి సంబరాలకు ఆంధ్రప్రదేశ్ పెట్టింది పేరు. అందులోనూ ముఖ్యంగా కోనసీమ. అక్కడ భోగిమంటలు, గొబ్బెమ్మలు, ముగ్గులు, హరిదాసులు, బసవన్నలే కాదు వీటన్నింటికీ పోటీగా కోడిపందాలు కూడా జోరుగా సాగుతూంటాయి. యువకులంతా పందెం కోళ్లమీద బెట్టింగులాడుతూ బిజీగా ఉంటారు. పోలీసులు, ప్రభుత్వాధికారులు అడపాదడపా నిషేధాజ్ఞలు విధించినా లోపాయికారీగా ఈ పందాలు జరిగిపోతూంటాయి.

కొన్ని ప్రాంతాలలో వాటి కాళ్లకు కత్తులు కట్టి మరీ బరిలోకి వదులుతుంటారు. పైగా ఈ పందేలను చూడడానికి డిజిటల్ స్క్రీన్లను కూడా ఏర్పాటుచేశారట. కొంతమంది నిర్వాహకులు గొడవలు జరగకుండా ప్రవేటు బౌన్సర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలు పెద్దఎత్తున ఈ పోటీలు చూడడానికి ఎగబడుతున్నారు. డబ్బు కోట్లలో ఖర్చు పెడుతున్నారు. ఈ పందేల కోసం సంవత్సరం పొడవునా కోడిపుంజుల్ని బాగా బలంగా పెంచుతారు. కొన్ని చోట్ల కోడిపందేల నిర్వహణను పోలీసులు అడ్డుకుంటే వారికి మామూళ్లు సమర్పించి, పందేలను కొనసాగిస్తున్నారు.