తెలంగాణ అసెంబ్లీ సమావేశాల కుదింపు

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై కూడా కరోనా వైరస్ ప్రభావం పడింది. సభకు వస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులతో పాటు మీడియా సిబ్బందికి సైతం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో సమావేశాలకు వస్తున్న సభ్యులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో వర్షాకాల సమావేశాలు కొనసాగించే అంశంపై ఇప్పుడు చర్చ నడుస్తున్నది. సిబ్బంది కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో మండలి చైనర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. వీరిద్దరు అసెంబ్లీ సమావేశాల కుదింపుపై చర్చించినట్లు సమాచారం. ఈ విషయంపై మరోమారు పార్టీల అభిప్రాయం తీసుకువాలని నిర్ణయించారు.

మరోవైపు వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజు సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు జీహెచ్ఎంసీ సహా నగరపాలికలు, శివారు మున్సిపాలిటిల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇక శాసనసమండలిలో విద్యుత్ అంశాలపై చర్చ జరగనుంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మండలిలోనూ తీర్మానం చేయనున్నారు.