ఏ ఒక్కరూ పస్తులు ఉండటానికి వీల్లేదు.

మెగాస్టార్ చిరంజీవి.. ఈపేరు స్క్రీన్‌పై కనబడగానే ఈలలు వేస్తూ, గోల చేస్తూ, అన్నయ్య అంటూ అరిచే అభిమానులు కోట్లలో ఉన్నారు. అంత మెండుగా, నిండుగా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు చిరంజీవి. అంతమంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి తాను ధన్యజీవిని అని ఫీల్ అవుతారు. అంతేకాదు ‘పే బ్యాక్ టు సొసైటీ’ అనే విషయానికి ఆయన చాలా ప్రాధాన్యత ఇస్తారు. దాసరి నారాయణరావు మరణం తరువాత దిశానిర్దేశం చేసే పెద్ద దిక్కు లేక దిక్కు తోచని స్థితిలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు అన్ని విధాలుగా వెన్ను దన్నుగా ఉండే పెద్దన్న బాధ్యత తీసుకున్నారు చిరంజీవి. సినిమా ఇండస్ట్రీలో జరిగే మంచి చెడులను గమనిస్తూ పెద్దరికంగా సమస్యలను పరిష్కరిస్తూ, మధ్య మధ్యలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ‘సైరా’ లాంటి భారీ సినిమా నిర్మించి కొన్ని వందల కుటుంబాలకు పని కల్పించిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణంలోనే తన తదుపరి సినిమా ‘ఆచార్య’లో నటుస్తున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ వల్ల షూటింగ్ నిలిచిపోయింది.

ఈ లాక్‌డౌన్ సమయంలో ‘ఆచార్య’ యూనిట్‌ని ఆదుకోవడానికి చిరంజీవి గానీ, నిర్మాతలు రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కానీ కాస్త సాయం చేస్తే సరిపోతుంది. కానీ, సాయం అనే సరికి చిరంజీవి గుండె సముద్రమంత విశాలంగా మారుతుంది. అందుకే, తెలుగు సినిమా పరిశ్రమను నమ్ముకుని రోజువారీ వేతనాలతో తమ జీవితం సాగించే 24 క్రాఫ్ట్స్‌ని ఆదుకోవాలనే అతి పెద్ద ఆలోచన చేశారు. కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) స్థాపించి తన ఆలోచనను ఆచరణలో పెట్టారు.

ఏదో ఒక్క నెల సాయం చేసి ఆపెయ్యాలి అనే ఆలోచన తమకు లేదు అని, లాక్ డౌన్ ఉన్నంత కాలం, తిరిగి షూటింగ్స్ మొదలయ్యేవరకు.. అది రెండు నెలలు అయినా, నాలుగు నెలలు అయినా సీసీసీ తరఫున సాయం అందిస్తామని చిరంజీవి స్పష్టం చేశారు. లాక్‌డౌన్ వల్ల సినిమా ఇండస్ట్రీలోని ఏ ఒక్కరూ పస్తులు ఉండడానికి వీలు లేదు అని చిరంజీవి చెప్పారు. దానికోసం అవసరమయితే ఎవరిముందుకు వెళ్ళి సాయం అడగడానికి అయినా వెనుకాడను అని చెప్పారు. ఇప్పటివరకు ఎవరినీ ఇది కావాలి అని అడగని తాను ఇప్పుడు మాత్రం ఆడుతానని, వాళ్ళు కూడా ముందుకు వచ్చి సాయం చేస్తారు అని జీవీకే, మేఘా లాంటి కొన్ని సంస్థల పేర్లు చెప్పుకొచ్చారు.