ఢిల్లీ ఘర్షణలు.. 20కి చేరిన మరణాలు..

ఢిల్లీ ఘర్షణలు.. 20కి చేరిన మరణాలు

ఢిల్లీ: సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో చనిపోయిన వారి సంఖ్య 20కి చేరింది. బుధవారం జీటీబీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ నలుగురు చనిపోయారు. అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13 నుంచి 20కి పెరిగింది. ఈ ఘర్షణల కారణంగా ఈశాన్య ఢిల్లీలోని 86 కేంద్రాల్లో సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఘర్షణలను తీవ్రంగా తీసుకున్న హోం మంత్రి అమిత్ షా.. నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.

ఢిల్లీలో పరిస్థితిని సమీక్షించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రంగంలోకి దిగారు. సరిపడా బలగాలు ఢిల్లీలో ఉన్నాయని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. మంగళవారం రాత్రి ఢిల్లీలోని శీలంపూర్ ఏరియాకు వెళ్లిన ధోవల్ పరిస్థితిని సమీక్షించారు. ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి అదుపులో ఉందని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ, కేబినెట్‌కు ధోవల్ ఢిల్లీలోని పరిస్థితి గురించి వివరించనున్నారు.