తక్కువ చెప్పి ఎక్కువ పనిచేస్తాం’.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌..

pqvqn-01.jpg

పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలా అని అనుకున్నాను. ఈ విధంగా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను తీసుకున్న శాఖలు చాలా కీలకమైనవని.. వాటిని అర్థం చేసుకోడానికి సమయం పట్టిందన్నారు. తక్కువ చెప్పి ఎక్కువ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్పారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్‌ తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గానికి తొలిసారి వచ్చారు. జూలై 1 సందర్భంగా వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు స్వయంగా తన చేతుల మీదుగా పెన్షన్ డబ్బులు రూ. 7 అందజేశారు. అనంతరం అక్కడి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యంత వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారంటే దివ్యంగులేనని గతంలో సీఎం చంద్రబాబు కూడా చెప్పారన్నారు. అందుకే వారికి ఈ ప్రభుత్వం పెన్షన్ పెంచిందని చెప్పారు. పంచాయితీ రాజ్ లెక్కలు చూస్తుంటే.. ఎటు వెళ్ళాయో అర్థం కావట్లేదని గతపాలకులకు చురకలు అంటించారు. రూ.600 కోట్లు ఖర్చు చేసి రుషికొండలో భవనాలు కట్టారని.. అదే డబ్బుతో ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదని అన్నారు. ఇప్పుడు ఆ నిధులన్నీ బుడిదలో పోసిన పన్నీరు అయిందని విమర్శించారు. తన కార్యాలయంలోకి ఫర్నీచర్ ఇస్తాను అని అధికారులు చెబితే వద్దూ నేనే కొనుకుంటాని చెప్పానన్నారు. తన వైపు నుండి అవినీతి అనేది ఉండదని మాట ఇస్తున్నానన్నారు. పంచాయతీరాజ్ శాఖలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఉండాలని ఆదేశించారు. కేంద్రంలో నిధులు ఉన్నా ఎందుకు అడగలేదో అర్థం కాలేదన్నారు. చేపల చెరువులు ఉన్న చోట నీళ్లు లేవు, గోదావరి చుట్టూ ఉన్నా తాగడానికి నీళ్లు ఉండడం లేదని అన్నారు. ఇది గతపాలకుల పరిపాలనా లోపం అని ఎత్తి చూపారు. స్కిల్ డెవలప్మెంట్ జరగాలి.. ఏ యువతలో ఏ టేలెంట్ ఉందో ఎవరికీ తెలీయదు.. వాటిని వెలికి తీసేందుకు కృషి చేస్తామన్నారు.

Share this post

scroll to top