పీసీబీ ఫైల్స్, రిపోర్టుల దగ్ధంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన ఫైల్స్, రిపోర్టులను కృష్ణా నది కరకట్టపై దగ్ధం చేయడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్ధం చేసిన ఫైల్స్, రిపోర్టులకు సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ దగ్ధం వెనక ఎవరెవరు ఉన్నారనే అంశాలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలకు ముందుకు వెళ్లాలని సూచించారు. పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్, రిపోర్టులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయని ప్రశ్నించారు. భద్రపరచేందుకు అనుసరిస్తున్న విధానాలు ఏమిటో వెల్లడించాలని ఆధికారులను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. కాగా… నిన్న రాత్రి యనమలకుదురు కట్ట మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖకు చెందిన ఫైళ్లను సిబ్బంది దగ్ధం చేసిన విషయం తెలిసిందే. మైనింగ్ శాఖకు చెందిన అనేక పత్రాలు, హార్డ్ డిస్క్, క్యాసెట్‌లు దగ్ధమయ్యాయి. ఈ కేసు విచారణలో వేగం పెంచిన పోలీసులు ఇప్పటికే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓఎస్‌డీ రామారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏయే డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌ల్లో ఏమున్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే దగ్ధం చేసిన ఫైల్స్ అన్నీ పనికి రానివని రామారావు చెబుతున్నాడు. మరికొందరు ఉన్నతాధికారులను కూడా పోలీసులు పిలిచి ప్రశ్నిస్తున్నారు.