కాకినాడ జిల్లాలో మూడో రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. ఉప్పాడ సముద్ర తీరానికి చేరుకొని కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. మన్నటి వరకూ మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే తాను గెలిచిన నియోజకవర్గంలో మూడురోజులపాటు పర్యటన చేపట్టారు. తొలిరోజు పిఠాపురంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్హులైన వారికి పెన్షన్లు అందించారు. ఆ తరువాత రెండవ రోజు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాగునీరు, అడవులు పరిరక్షణపై ఫోకస్ పెట్టారు. అయితే మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజు పలు కీలకమైన అంశాలపై దృష్టి సారించారు. ఉప్పాడ సముద్ర తీరానికి చేరుకుని అక్కడి స్థానికులతో మాటామంతి నిర్వహించనున్నారు. కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించి ప్రత్యమ్నాయ మార్గాలు చూపాలని అధికారులకు ఆదేశించనున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసుందుకు కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. అక్కడి పర్యటన తరువాత తిరిగి పిఠాపురంకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం తన దృష్టికి వచ్చిన వివిధ ఫిర్యాదులు, సమస్యలపై అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేయనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన టీడీపీ, బీజేపీ నాయకులతో పవన్ భేటీకానున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్యనాయకులు కార్యకర్తలు కూడా పాల్గొననున్నారు. అతరువాత సాయంత్రం 4 గంటలకు పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో వారాహి వాహనంపై బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ సభ వేదికగా తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ వారాహి బహిరంగసభ ముగిసిన వెంటనే విజయవాడ బయల్దేరి వెళ్లనున్నారు. దీంతో మూడురోజుల పర్యటన సజావుగా ముగియనుంది.