దేవాలయాలకు వెళ్లేందుకు భక్తులు సాధారణంగా సంప్రదాయ దుస్తులను ధరిస్తారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ముందుంటారు. నుదుటిపై కుంకుమ, తలలో పూలు పెట్టుకుంటారు.. కానీ శ్రీవేంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైన తిరుమలలో మాత్రం మహిళలు పూలు పెట్టకూడదు అనే నియమం ఉందని మీకు తెలుసా..? భువైకుంట తిరుమలకు ఏటా కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అనేక ఇతర రాష్ట్రాలతో పాటు ఏడుకొండల వెంకన్న దర్శనం కోసం ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. కేవలం భారతదేశం నుంచి మాత్రమే దేశ విదేశాల నుండి కూడా భక్తులు తిరుమలకు వస్తుంటారు. గంటలు, రోజుల తరబడి క్యూలో నిలబడి గోవిందా అంటూ.. లక్ష్మి వల్లభను కొలుస్తుంటారు. పురాణాలలో తిరుమలను పూల మంటపం అంటారు. తిరుమల పూల మంటపం కావడంతో శ్రీహరి పుష్పాలంకరణ ప్రియుడు కావడంతో స్వామివారిని నిత్యం టన్నుల కొద్దీ పూలతో అలంకరించి పూజలు చేస్తుంటారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వందలాది అలంకారాల్లో గోవిందుడు భక్తులను పులకింపజేస్తాడు. తిరుమలలో పూచే ప్రతి పుష్పం శ్రీ మన్న నారాయణునికి అంకితమని ప్రజలు, భక్తులు విశ్వసిస్తారు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు పూలను తాకకూడదనే నిబంధనను అమలులోకి తెచ్చింది. ఈ కారణం చేతనే స్వామి వారి దర్శనానికి వచ్చే మహిళలు తలలో పూలు ధరించరు.