ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

రేపు ఇంద్రకీలాద్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రానున్న సందర్భంగా.. ఆలయం వద్ద చేస్తున్న ఏర్పాట్లను, భక్తులకు కల్పించిన సౌకర్యాలను అధికారులు సోమవారం పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ (రెవిన్యూ) డాక్టర్‌ కె.మాధవిలత, జాయింట్‌ కలెక్టర్‌ (సంక్షేమం)కె.మోహన్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌ చంద్‌ లు పరిశీలించారు. క్యూలైన్ల ద్వారా దర్శనాన్ని మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవిలత ఆదేశించారు. మెట్ల మార్గం నుంచి అంతరాలయం వరకు వున్న ఐదు క్యూలైన్లను నిశితంగా పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేని రీతిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. సుమారు రెండు గంటలపాటు ఆలయ ప్రాంగణంలో, క్యూ లైన్ల, ఓంకారం ప్రాంతాల్లో పర్యటించి భక్తులతో మాట్లాడి వారి ఫీడ్‌ బ్యాక్‌ ను కూడా తెలుసుకున్నారు.