ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి : మాజీ మంత్రి ఎర్రబెల్లి

yerrabelli-.jpg

విశ్వనటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామా రావు 101వ జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఆయన్ను ఇవాళ స్మరించుకుంటున్నారు. పలువురు సినీ, రాజకీయ నేతలు ఈ సందర్భంగా ఎన్టీఆర్కు నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి ఫ్యామిలీతో పాటు ఇతర రాజకీయ నేతలు అంజలి ఘటించారు.

తాజాగా మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఎన్టీఆర్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్కు కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ మహనీయుడు తనకు దైవ సమానులు అని, రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన నేత అని పేర్కొన్నారు. తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకుడిని అని చెప్పిన ఎర్రబెల్లి.. 25 ఏళ్ల వయసులోనే తనకు ఎన్టీఆర్.. వరంగల్ జిల్లా పార్టీ పదవి ఇచ్చారని తెలిపారు. ఆయన ఆశీర్వాదంతోనే 26 ఏళ్లకే తాను ఎమ్మెల్యేగా పోటీ చేశానని వెల్లడించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ప్రస్తుత ప్రభుత్వాలు పని చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

Share this post

scroll to top