తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈనెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరగనుంది. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సమావేశంలో చర్చించాల్సిన అజెండాను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి హైలెవెల్ మీటింగ్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు. తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా.. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. వాస్తవానికి పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్ధిక సంఘం తదితర 23 కార్పొరేషన్ల ఆస్థులపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్‌లోని తెలుగు అకాడమీ, అంబేద్కర్, తెలుగు విశ్వవిద్యాలయం వంటి 30 సంస్థల ఆస్థులు, సేవలపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. రాజ్‌భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్ సంస్థల బకాయిలపైనా వివాదాలున్నాయి. రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ పలు సమావేశాలు నిర్వహించినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. ముఖ్యమైన చిక్కులను ముఖాముఖి చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపడంతో రెండు రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలు కొలిక్కి రావచ్చని ఇరు రాష్ట్రాలు ఆశిస్తున్నాయి.
- Home
- News
- Andhra Pradesh
- తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై సర్వత్రా ఉత్కంఠ.. పెండింగ్‌లో ఉన్న అంశాలు ఇవే..