భారత​ కుబేరుల్లో అగ్రస్థానంలో అంబానీ

 రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ఫోర్బ్స్‌ ఇండియా జాబితాలో అత్యంత ధనవంతుల్లో వరుసగా 14వ ఏడాది అగ్రస్థానంలో నిలిచారు. గతేడాది కాలంలో ముకేష్‌ సంపాదన 4 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.29వేల కోట్లు) పెరిగింది. మొత్తంగా 92.7 బిలియన్‌ డాలర్ల (రూ.6.95 లక్షల కోట్లు) నికర విలువ కలిగి ఉన్నారు. భారత్‌లో టాప్‌ 100 కుబేరుల జాబితాను గురువారం ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ 100 మంది ధనవంతులైన భారతీయుల మొత్తం సంపద ఏడాది కాలంలో 775 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఈ జాబితాలో గౌతమ్‌ అదానీ రెండవ స్థానంలో ఉన్నారు. 2020లో అదానీ సంపద దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2020లో ముకేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీల సంపద మధ్య అంతరం 63.5 బిలియన్‌ డాలర్లుగా ఉంటే.. అది ఇప్పుడు 17.9 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. గౌతమ్‌ అదానీ సంపద 2021లో ఏకంగా 49.5 బిలియన్‌ డాలర్లు (రూ.3.70 లక్షల కోట్లు)పెరిగింది.