ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ..

harishrao-28.jpg

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు లో అరెస్టు అయి తిహాడ్‌ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో శుక్రవారం ఉదయం ఆయన భేటీ అయ్యారు. ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండమని ఆయన కవితను సూచించారు. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్‌ అయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కేసులో ఆమెకు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీని జూలై 5 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం శుక్రవారం (జూన్ 21వ తేదీ) ఆదేశాలిచ్చింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి 15న అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మార్చి 16న ఆమెను ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. 10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత కవితను తిహాడ్‌ జైలుకు తరలించారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్న కవితను సీబీఐ ఏప్రిల్‌ 11న అరెస్టు చేసింది. ఈడీ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీ జూలై 3 వరకు ఉంది. అయితే, సీబీఐ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీ శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో జైలు అధికారులు కవితను వర్చువల్‌ విధానంలో రౌస్‌ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. కాగా, కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.

Share this post

scroll to top