వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన పలువురు పెద్దలు ఎన్నో అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. మంత్రి హోదాలో ఉంటూనే దౌర్జాన్యాలకు, కబ్జాలకు తెరలేపి అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారు ఎందరో. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అలాంటి చర్యలకు పాల్పడి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఆయన తన ఇంటి కోసం ఏకంగా మున్సిపాలిటీ రోడ్డునే ఆక్రమించేశారు. తన ఇంటికి వెళ్లడానికి అధికార దుర్వినియోగంతో మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో వేసిన రోడ్డును పెద్దిరెడ్డి ఉపయోగించుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా రోడ్డుపై ప్రజలు ఎవరు రాకుండా ఇరువైపులా పెద్ద పెద్ద గేట్లను నిర్మించారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డులో ప్రజలు తిరగాలని చుట్టుపక్కల కాలనీవాసులు డిమాండ్ చేశారు. ప్రజలకు జనసేన టీడీపీ నేతలు అండగా నిలబడ్డారు. గేట్లను మున్సిపల్ కార్పొరేషన్ తొలగించకుంటే తామే పడగొడతామని ఇరు పార్టీ నేతలు తేల్చిచెప్పారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరికాసేపట్లో గేట్లు బద్దలు కొడతామని మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్హామీ ఇచ్చారు.