ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వినియోగిస్తున్న భాష సరిగ్గా లేదని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. తమపై రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష, నేరపూరిత వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు.
రాహుల్ గాంధీపై బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిందని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాటల తీరుపై ఎలాంటి చర్యలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఒక రూల్ గల్లీలో మరో రూల్ ఉందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని, ఆయనపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.