తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుందని అధికారులు పేర్కొన్నారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
దాంతో గురువారం మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని గంటకు 40-50 కిలోమీటర్ల గాలులు వీస్తూ వర్షాలు కురిసే పడే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.