మానవులు చప్పట్లు కొట్టే పద్దతి పూర్వకాలం నుంచి ఉంది. వివిధ సందర్భాలలో చప్పట్లు కొడతారు. దేవుడికి భజన చేసే సమయంలో లేదా కీర్తించే సమయంలో కూడా చప్పట్లు కొట్టడం తప్పనిసరి. చప్పట్లు కొట్టడం అనేది ఉత్సాహం.. ఆనందంతో ..ఇతరులను ప్రశంసించడానికి చేసే ఓ పని. అంతేకాదు ఇతరులు చేసిన మంచి పనిని ప్రశంసించడానికి కూడా చప్పట్లు ఉపయోగిస్తారు. అయితే చప్పట్లు కొట్టడం ఎలా మొదలైందో వివరంగా తెలుసుకుందాం.
భక్త ప్రహ్లాదుడితో ముడిపడిన చప్పట్లు కొట్టే సంప్రదాయం
పురాణాల ప్రకారం చప్పట్లు కొట్టే సంప్రదాయం భక్త ప్రహ్లాదుడి వలన మొదలైంది అని నమ్ముతారు. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపునికి ప్రహ్లాదుడు.. విష్ణువును పూజించడం, అతని కీర్తనలు పాడడం ఇష్టం లేదు. అందువలన ప్రహ్లాదుని భజన కీర్తనలో ఉపయోగించే అన్ని సంగీత వాయిద్యాలను ధ్వంసం చేశాడట. అప్పుడు ప్రహ్లాదుడు భజన కీర్తనలో లయను కొనసాగించలేకపోయాడు.. భజన, కీర్తన చేసే సమయంలో ఇబ్బంది పడ్డాడు. అప్పుడు ప్రహ్లాదుడు భగవంతుని కీర్తనలో లయను సృష్టించడానికి చప్పట్లు కొట్టడం ప్రారంభించాడు. దీని తరువాత ఇతర వ్యక్తులు కూడా ప్రహ్లాదుడిలా భజన కీర్తనలో చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. అప్పటి నుంచి చప్పట్లు కొట్టే సంప్రదాయం ప్రారంభమైందని పురాణాల ప్రతీతి.