రాష్ట్రంలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మంత్రి పై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు, పోలీసుల రియాక్షన్ పై అసహనం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ తాను హోం మంత్రిని అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉండేవని ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత భేటీ పై ఉత్కంఠ నెలకొంది.
ఈ సమావేశం పై హోంమంత్రి అనిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మర్యాదపూర్వకంగా సమావేశమవడం జరిగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం పరిశ్రమించే ప్రజా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం అని హోం మినిస్టర్ అనిత ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.