డీఎస్ తో కలిసి పని చేసే అదృష్టం కలిగింది కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..

kishn-reddy-29.jpg

సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ తో కలిసి పని చేసే అదృష్టం తనకు కలిగిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ధర్మపురి శ్రీనివాస్ పార్ధీవ దేహాన్ని సందర్శించేందుకు హైదరాబాద్ లోని డీఎస్ నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డి.. ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ధర్మపురి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వహించడం జరిగిందని, వారు శాసనసభ సభ్యుడిగా ఉన్నప్పుడు వారితో కలిసి శాసనసభలో పని చేసే అదృష్టం కలిగిందని అన్నారు. 2004 లో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించడం జరిగిందని గుర్తు చేశారు. ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయతతో మాట్లాడేవారని, వారి కుమారుడు ఎంపీ అరవింద్ బీజేపీలో జాయిన్ అయ్యే సమయంలో కూడా మీరంతా యువకులు దేశం కోసం పనిచేయాలని చెప్పారని, నిరంతరం వారి ప్రోత్సాహం నాకు దక్కిందని అన్నారు. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పోరాడిన వ్యక్తి అని, తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారని, అలాంటి వ్యక్తి మరణించడం బాధాకరమన్నారు. వారి మృతికి సంతాపం తెలియజేస్తున్నానని, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు.

Share this post

scroll to top