సత్యం కోసం‌ పయనించిన శంకరులు..వైశాఖ శుద్ధ పంచమి శ్రీ ఆది శంకరాచార్య జయంతి

సత్యం కోసం‌ పయనించిన శంకరులు..వైశాఖ శుద్ధ పంచమి శ్రీ ఆది శంకరాచార్య జయంతి

ఆనాటి సమకాలీన హిందూమత ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలిచేవారు, హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరాచార్యులు ‘అద్వైత’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు క్రీ.శ. 788 సంవత్సరంలో కేరళా రాష్ట్రంలో ‘కాలడి’ అనే గ్రామంలో వైశాఖ శుద్ధ పంచమి రోజున శ్రీమతి ఆర్యాంబ, తండ్రి బ్రహ్మశ్రీ శివగురుదేవులనే విశ్వాబ్రాహ్మణ పుణ్య దంపతులకు జన్మించి క్రీ.శ 820 సంవత్సరంలో శివైక్యం పొందారు. శంకరాచార్యుల చిన్న వయస్సులోనే తండ్రి మరణించాడు. తన తల్లి కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరాచార్యులు ఏకసంథాగ్రాహి, బాల్యంలోనే వేద విద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరాచార్యులు ఒకరోజు భిక్షాటన చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా భిక్ష వేసేందుకు ఏమీ లేక తన ఉపవాసాన్ని విరమించడం కోసం దాచుకున్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరాచార్యులు ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది.

ఒకరోజు శంకరాచార్యుల తల్లి పూర్ణానది నుండి నీళ్ళను మోసుకువస్తుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరాచార్యులు పూర్ణానదిని ప్రార్థించి నదిని ఇంటి వద్దకు తెప్పించారు. ఆ విధంగా నదీ ప్రవాహ మార్గం మారే సరికి గ్రామ ప్రజలు శంకరాచార్యులు తల్లి కొరకు చేసిన పనికి ఆశ్చర్య పోయారు. తల్లి అంగీకారం తీసుకుని శంకరాచార్యులు తన ఊరు కాలడిని విడిచి గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళాడు. నర్మద నది ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం కలిగింది. వ్యాస మహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరాచార్యులు అడవుల నుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది.శంకరాచార్యులు జీవితానికి సంబంధించిన వివిధ గాథలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి “చరిత్ర”లలో కొన్ని శంకరాచార్యుల జీవిత గాథలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి, అందుకే ఆది శంకరాచార్యులు జగద్గురువు అయ్యాడు.