ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన కె.కేశవరావుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా వ్యవహారాల సలహాదారుగా కేశవరావు కొనసాగుతారు. కేశవరావుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేకే గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంకడ్‌తో కలిసి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కేకే పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉంది. దీంతో పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు, ఎంపీ ఎన్నికల్లో టిక్కెట్ రాని సీనియర్ నేతలు ఆ సీటుపైనే ఆశలు పెట్టుకున్నారు. అయినా వారి ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయవాది, ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వీకి సీటు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.