ఎన్నికల సమయంలో ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రస్తుతం వాటిని అమలు చేయలేక మాటలు చెబుతున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.. నెల్లూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉచిత సిలిండర్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు లబ్ధిదారులను మొదట డబ్బులు చెల్లించమని తర్వాత ఖాతాలో జమ చేస్తామని చెబుతున్నారన్నారు. అనేక కార్యక్రమాల్లో విఫలం అవుతున్న చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఎదుర్కొనలేక ఆయన కుటుంబం మీద వివిధ రకాలుగా మాట్లాడుతున్నారన్నారు. వ్యక్తిగత విషయాలు కుటుంబ విషయాలు తీసుకురావడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో ఫేక్ న్యూస్ ను వదలడంలో లోకేష్ దిట్ట అని కాకాణి అన్నారు. వందలాది కోట్ల ఆస్తులున్న చంద్రబాబు తన సోదరుడు చెల్లెళ్లకు ఎంత మేర పంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలను తొక్కి పెట్టి నార తీస్తానని అంటున్న పవన్ కల్యాణ్ అన్యాయాలు అక్రమాలు చేస్తున్న టీడీపీ నేతల నార తీయాలని సూచించారు. ప్రభుత్వ విమర్శిస్తే కేసులు పెడుతున్నారని ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి.