ఈ బాధ్యత కరీంనగర్ ప్రజలు పెట్టిన బిక్ష అని..సామాన్య కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదిగానంటే బీజేపీ కారణమని బండి సంజయ్ అన్నారు. 152 రోజులు కుటుంబానికి దూరమై ప్రజా సంగ్రామయాత్రతో తన వెంట ఉన్నారని గుర్తుచేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా సొంత గడ్డ కరీంనగర్ కు చేరుకున్న బండి సంజయ్ కి బీజేపీ కార్యకర్తలు బుల్డోజర్ తో అపూర్వ స్వాగతం పలికారు. బుల్డోజర్లపై నుంచి పూలు చల్లి…గజమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. కరీంనగర్ గడ్డకు పాదాభివందనం చేయడం ద్వారా తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జై బీజేపీ…. జైజై నరేంద్ర మోడీ… భారతమాతాకీ జై అంటూ నినదించారు బండి సంజయ్. బండి సంజయ్ కరీంనగర్ గడ్డపై ప్రణమిల్లి సాష్టాంగ నమస్కారం చేయడంతో కరీంనగర్ ప్రజలు ఫిదా అయ్యారు. అనంతరం గీతాభవన్ చౌరస్తాకు చేరుకున్న బండి సంజయ్ కు అపూర్వ స్వాగతం దక్కింది. స్థానిక ముస్లిం నేతలు భారీ గజమాలతో స్వాగతం పలికారు. నేరుగా బండి సంజయ్ మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. కార్యకర్తల కష్టార్జితం వల్లే ఈరోజు తనకు ఈ పదవి లభించిందన్నారు. ఈ పదవి, హోదా కార్యకర్తలకు అంకితం చేస్తున్నానన్నారు.