లక్షద్వీప్‌కు చెందిన నటి, మోడల్, దర్శకురాలు ఆయేషా సుల్తానాకు కేరళ హైకోర్టు యాంటిసిపేటరి బెయిల్ మంజూరు చేసింది. లక్షద్వీప్ పోలీసులు రాజద్రోహం కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా.. ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జస్టిస్ అశోక్ మీనన్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రశాంతంగా ఉండే దీవిలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం, కరోనా కేసుల్ని అరికట్టడంలో విఫలమైనందుకు ప్రఫుల్‌ని కేంద్రం ప్రయోగించిన బయోవెపన్‌గా ఆమె అభివర్ణించారు. మలయాళం న్యూస్ చానల్ మీడియా వన్ టీవీ చర్చలో పాల్గొన్న ఆయేషా సుల్తానా ‘లక్షద్వీప్‌లో గతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పుడు రోజుకి 100 కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం లక్షద్వీప్‌కి జీవాయుధాన్ని పంపింది. అందుకే కేసుల సంఖ్య పెరిగిపోతోంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేత అబ్దుల్ ఖదేర్ కవరట్టి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.
