ఏపీలో నిన్నటివరకు విజయం మాదే అని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ నేతల్లో నేడు నిరుత్సాహం నెలకొంది. ఓట్ల లెక్కింపు మొదలైన రెండు గంటల్లోనే ట్రెండ్ స్పష్టమైంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 100కి పైగా స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతుండగా, అధికార వైసీపీ చాలా వెనుకబడిపోయింది. ఆ పార్టీకి చెందిన మంత్రులు కౌంటింగ్ హాళ్ల నుంచి నిరాశతో నిష్క్రమిస్తున్నారు.
తాజాగా, మాజీ మంత్రి, గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా పరిస్థితుల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. ఏపీలో సీఎం జగన్ మినహా మంత్రులకు ఎదురుగాలి వీస్తున్నట్టు ఓట్ల లెక్కింపు సరళి చెబుతోంది. ప్రారంభ రౌండ్లలో ఆధిక్యంలోకి వచ్చిన ఒకరిద్దరు మంత్రులు… ఆ తర్వాత రౌండ్లలో వెనుకంజ వేశారు.