మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజక్టు కన్నప్ప చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో హైప్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కన్నప్ప టీజర్ ను ఆవిష్కరించారు. దీనిపై మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా డీటెయిల్స్ పంచుకున్నారు. కన్నప్ప టీజర్ ను కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించాం. అదిరిపోయే స్పందన వచ్చింది. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడి ప్రవాస భారతీయులు… ఇలా ప్రతి ఒక్కరి నుంచి సానుకూల స్పందన వచ్చింది. వారు కన్నప్ప టీజర్ ను ఎంతగానో ఇష్టపడ్డారు.
భారత్ లోని ప్రేక్షకుల కోసం టీజర్ ను జూన్ 13న రిలీజ్ చేస్తున్నాం. మే 30వ తేదీన హైదరాబాద్ లోని ఓ ప్రముఖ సినిమా థియేటర్ లో కన్నప్ప తెలుగు టీజర్ ను ప్రదర్శించబోతున్నాను. నేను కన్నప్ప ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా నాకు మద్దతుగా సందేశాలు పంపుతూ, నా వెన్నంటి నిలిచి ప్రోత్సహిస్తున్న కొందరు ఎంపిక చేసిన ప్రేక్షకులను ఈ టీజర్ స్పెషల్ స్క్రీనింగ్ కు ఆహ్వానిస్తున్నాం. మీ అందరితో కన్నప్ప ప్రపంచాన్ని పంచుకోవడానికి ఎప్పుడెప్పుడా అని తహతహలాడుతున్నాను” అంటూ మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.