ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంచలన ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవలను బంద్ చేస్తున్నట్లు పిలుపునిచ్చింది. ఆగస్ట్ 17న ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. సుమారు 24 గంటల పాటు వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ఐఎంఏ పేర్కొంది. అయితే ఐఎంఏ ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది.. కారణాలు ఏంటి అంటే.. కోల్కతా వైద్యురాలి మృతికి నిరసనగా దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆగస్టు 9న కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో డ్యూటీ డాక్టర్ అత్యాచారం, హత్య ఈ నిర్ణయానికి కారణమని పేర్కొంది. ఇందుకు నిరసనగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఐఎంఏ చెప్పుకొచ్చింది.
ఈ మేరకు ఐఎంఏ ప్రకటన జారీ చసింది. “వైద్యురాలిపై హత్యాచారం ఘటన వైద్య వర్గాలతో పాటు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటి నుంచి రెసిడెంట్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు, కొవ్వొత్తుల ర్యాలీలు జరుగుతున్నాయి” అని ప్రకటనలో ఉంది. అంతేకాక ఈ ఘటనకు నిరసనగా.. ఆగస్టు 17 శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 18 ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు మోడ్రన్ మెడిసిన్ వైద్యుల సేవలను నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.