నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. డీసీసీబీ ఛైర్మన్‌గా కుంభం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీసీసీబీ ఛైర్మన్ పీఠానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో కుంభం శ్రీనివాస్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కోపరేటివ్ అధికారి ప్రకటించారు. ఎన్నికకు 15 మంది డైరెక్టర్లు హాజరు కాగా.. నలుగురు డైరెక్టర్లు గైర్హాజరయ్యారు. మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై 3 రోజుల క్రితం డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం చేయడంతో నూతన చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. అనంతరం జరిగిన డీసీసీబీ ఛైర్మన్ పదవి ప్రమాణ స్వీకారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజుల్లో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. రెండు లక్షల రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలు చేసిన రైతు రుణమాఫీ వల్ల రైతులకు ప్రయోజనం కలగలేదని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అందుకు రైతు రుణమాఫీ ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. రుణమాఫీ వల్ల 32 వేల కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసే రాష్ట్రాన్ని దివాలా తీసినా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకు పోతున్నారని ధన్యవాదాలు తెలిపారు.