మాజీ సీఐడీ అధికారులపై కేసు పెట్టిన ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు..

rrr-12.jpg

మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్‎పై కేసు నమోదైంది. గత నెల 10న ఉండి ఎమ్మెల్యే రఘురామక్రిష్ణంరాజు లేఖ ద్వారా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న గుంటూరు నగరంపాలెం పోలీసులు.. పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేశారు. 2021 మే 14 వ తేదీన మాజీ సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అప్పటి ఎంపి రఘురామక్రిష్ణంరాజుపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‎లో ఉన్న ఆయనను అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు. రాత్రంతా కార్యాలయంలోనే విచారించారు. అనంతరం గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టగా వైద్య పరీక్షలు చేసేందుకు హైదరాబాద్‎లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. అనంతరం సుప్రీం కోర్టులో రఘురామక్రిష్ణం రాజుకు ఊరట లభించింది. అయితే హైదరాబాద్‎లో అరెస్ట్ చేసినప్పటి నుండి కోర్టులో ప్రవేశపెట్టే వరకూ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారని.. తనను హత్య చేసే ప్రయత్నం చేశారని కంప్లైంట్ ఫైల్ చేశారు. అలాగే పోలీసులు టార్చర్ చేశారంటూ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు.. ఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అప్పటి ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. బాధ్యులెవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్నప్తి చేశారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు లేఖపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Share this post

scroll to top