రాష్ట్ర హోం మంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోం మంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారన్న డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వరుదు కళ్యాణి స్పందించారు. ఇప్పటికైనా హోం మంత్రి అనితను మార్చాలని ఆమె సూచించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి తిట్టడానికి అనితకు హోం మంత్రి పదవి ఇచ్చారని తప్పుపట్టారు. అత్యాచార నిందితులపై అనిత ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని వరుదు కళ్యాణి ప్రశ్నించారు. అనితను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని పేర్కొన్నారు. కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, ఇప్పటికైనా కూటమి సర్కార్ తీరు మార్చుకోవాలని ఆమె సూచించారు.