అత్యంత రద్దీ కలిగిన హైవేకు మోక్షం జూలై 1నుంచి టోల్ వసూళ్లు చేసేది వీళ్లే..

tool-plaza-28.jpg

దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు మోక్షం కలిగింది. ఈ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఆరు లైన్ల విస్తరణ పనుల కోసం కాంట్రాక్టర్ ఖరారు అయ్యేవరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ వసూలు చేయనుంది. ప్రస్తుత గుత్తేదారు జీఎంఆర్ సంస్థ స్థానంలో ఎన్ఎహ్ఏఐ జూలై ఒకటవ తేదీ నుంచి ఈ టోల్ చార్జీలను వసూలు చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 9 నెంబర్ జాతీయ రహదారిగా పేరున్న హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి యాక్సిడెంట్లకు కేరాఫ్ అడ్రస్‎గా ఉండేది. రెండు లైన్లుగా ఉన్న ఈ హైవేను రూ.1740 కోట్లతో బీవోటీ పద్ధతిన జీఎంఆర్ సంస్థ నాలుగు లైన్లుగా విస్తరించింది. విస్తరణ సమయంలోనే ఆరు లైన్లకు సరిపడా భూసేకరణ జరిపారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181 కిలోమీటర్ల పొడవున రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించింది. 2012లో తెలంగాణలో పంతంగి, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలతో టోల్ వసూలు చేస్తోంది. జీఎంఆర్‎ టోల్ వసూలుకు 2025 జూన్ వరకు గడువు ఉంది. అయితే 2024 వరకు NH65ను ఆరు లైన్లుగా విస్తరించేలా ఆ సంస్థతో ఒప్పందం కుదిరింది.

Share this post

scroll to top