మంత్రివర్గవిస్తరణతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే బీమా భారతి నుండి వ్యతిరేకత ఎదురైంది. జెడి(యు) ఎమ్మెల్యే లేషి సింగ్‌కు కొత్త కేబినెట్‌లో మంత్రి పదవి దక్కగా, తనకు మాత్రం మొండిచెయ్యి చూపారంటూ బీమా భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. లేషి సింగ్ మంత్రిగా కొనసాగితే తాను రాజీనామా చేస్తానని ఆమె హెచ్చరించారు. లేషి సింగ్ ప్రతిసారీ తన నియోజకవర్గంలో ఇబ్బందులు సృష్టిస్తుందని, అలాంటి వ్యక్తిని కేబినెట్ లోకి తీసుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. లేషిసింగ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను వెనుకబడిన కులానికి చెందినందున తనను మంత్రిగా నియమించలేదని మండిపడ్డారు. అయితే లేషిసింగ్ 2013, 2014, 2019లో కూడా మంత్రిగా ఉన్నారని, అప్పుడు ఇలాంటి ఆరోపణలు రాలేదని .. ఇవన్నీ అర్థరహితమని నితీష్ కు మార్ కొట్టిపారేశారు. ప్రతిసారీ ప్రతి ఒక్కరికీ మంత్రిని చెయ్యలేమని నితీష్‌కుమార్ పేర్కొన్నారు.
