బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. భాగ్యనగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలు..

cong-04.jpg

హైదరాబాద్‌లో రాహుల్‌ వర్సెస్‌ మోదీ.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎లో ఇవాళ ఇదే సీన్‌ కనిపించింది. కాంగ్రెస్‌, బీజేపీ యూత్‌ వింగ్‌లు చేపట్టిన పోటాపోటీ ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. హిందుత్వంపై రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ వేదికగా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ యూవ మోర్చా ఆందోళనకు దిగింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీభవన్‌ ముట్టడికి బయల్దేరిన బీజేవైఎం కార్యకర్తలను అక్కడే పోలీసులు అడ్డుకున్నారు. బీజేవైఎం కార్యకర్తలు బారికేడ్లు తోసుకుని ముందుకెళ్లడంతో ఇరువర్గాలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాక్కునేందుకు ప్రయత్నించినా.. రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను బీజేవైఎం కార్యకర్తలు దహనం చేశారు. అటు, బీజేపీకి పోటీగా ఆందోళనకు దిగింది కాంగ్రెస్‌ పార్టీ. రాహుల్‌పై మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ.. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయల్దేరారు యూత్‌ కాంగ్రెస్‌ నేతలు. దీంతో గాంధీభవన్‌ ఎదుట బారికేడ్లు పెట్టి.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, రెండు పార్టీల ఆఫీసుల దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాహుల్‌ క్షమాపణ చెప్పాలంటూ బీజేవైఎం డిమాండ్ చేస్తుంటే.. మోదీ క్షమాపణ చెప్పాలంటూ యూత్‌ కాంగ్రెస్‌ నేతలు పట్టుబడుతున్నారు. ఇరు వర్గాలను పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో వాతావరణం సర్థుమణిగింది.

Share this post

scroll to top