ప్రస్తుతం విజయవాడలో భారీ వర్షాల కారణంగా ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుంది. ఇక ప్రకాశం బ్యారేజ్ వరద నీటితో ప్రవహిస్తుంది. తొలిసారిగా వరద నీరు 11 లక్షల క్యుసెక్కులు దాటింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ ప్రవాహం ప్రమాదకరంగా మారిపోయింది. 125 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో వరద నీరు వచ్చి చేరిందని అధికారులు అంటున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో 11.25 లక్షల క్యుసెక్కులు దాటేసింది. ప్రమాద స్థాయిలో వరద నీరు వచ్చి చేరడం కలవరం రేపుతుంది. 2009లో అక్టోబర్ 5వ తేదీన వరదనీరు రికార్డు స్థాయిలో 10 లక్షలపైగా క్యుసెక్కులు దాటింది.అంతకు ముందు 1903 లో అక్టోబర్ 7 లో మాత్రమే 10,60,830 లక్షల క్యుసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ లో ఏకంగా 11 లక్షల క్యుసెక్కుల వరద నీరు ప్రవహించడంతో కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా బుడిమేరుకు గండి పడటంతో సింగ్ నగర్, ప్రకాశ్ నగర్, వాంబే కాలనీ, పైపుల రోడ్, ఖండ్రిగ, న్యూ రాజేశ్వరిపేట, ఊర్మిళా నగర్, వైఎస్సార్ కాలనీ, జక్కంపూడి కాలనీలోని ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. పలు ఇండ్లల్లోకి నీరు చేరుడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక కృష్ణలంక రైల్వే బ్రిడ్జి అంచుల వరకు వరదనీరు ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ కి వరద నీటి ఉధృతితో కొన్ని బోట్లు కొట్టుకువస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.