లాక్‌డౌన్ టైమ్‌లో డెలివరీ అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

కరోనా వైరస్ కారణం గా మన జీవితాల్లో చాలా మార్పులు జరిగాయి. అనుకున్నవేవీ అనుకున్నట్టు జరిగే పరిస్థితి లేదు. దీనిలో కాబోయే తల్లిదండ్రులు బిడ్డ జననంకోసం వేసుకున్న ప్రణాళికలు కూడా ఉంటాయి. మీ డ్యూ-డేట్ ఈ సమయంలోనే ఉంటే ఎలా? లేదా మీ ఆరోగ్యం, లేదా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి మీకేమైన సందేహాలొస్తే ఎలా? ఇలాంటి సందేహాలు చాలామంది కాబోయే తల్లిదండ్రులకి ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. కాబట్టి ‘లాక్ డౌన్ లో డెలివరీ’ ప్లాన్ తయారుగా ఉంచుకోండి. మీ సందేహాలలో కొన్నింటికి సమాధానాలు..

​1. పుట్టబోయే బిడ్డకి ఈ వైరస్ వస్తుందా..

కాబోయే తల్లిదండ్రులందర్నీ వేధిస్తున్న సమస్యల్లో ఇది మొదటిది. వృద్ధులూ, గర్భిణీలూ హై-రిస్క్ కేటగిరిలో ఉన్నారు. ఈ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పట్నించీ పసిపిల్లలకి కూడా ఈ వైరస్ సోకుతున్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటివి జరగవు అని చెప్పకపోవచ్చు గానీ జరిగే అవకాశాలు చాలా తక్కువ అని నిపుణులు చెబుతున్నారు. తల్లి నుంచి బిడ్డకి సోకే అవకాశం కూడా చాలా తక్కువ. ఒకవేళ తల్లిదండ్రులలో ఎవరికైనా కరోనా సోకవచ్చేమో అన్న అనుమానం ఉంటే, బిడ్డని వారినించి కొన్ని రోజులు దూరంగా ఉంచుతారు.

​2. వైద్యులని సంప్రదిస్తుండాలి..

ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండడం కోసం చాలా హాస్పిటల్స్ లో మిగిలిన పనులన్నీ ఆపేశారు. మీ డెలివరీ కి ముందు మీకేమైనా అపాయింట్మెంట్ ఉంటే మీ డాక్టర్ కి కాల్ చేసి కనుక్కోండి. ఇలాంటి సమయంలో ఒకటికి రెండుసార్లు అడిగి తెలుసుకోవడంలో తప్పేం లేదు. మీ బిడ్డ జననానికి సంబంధించి ఒక ప్లాన్ తయారుచేసుకుని ఉండండి.

​3. టెక్నాలజీ గురించి తెలుసుకోండి..

ఇంటర్నెట్ ఈ సమయంలో ఎంతో సాయం చేస్తుంది. అనుకోని పరిస్థితుల్లో ఏం చేయాలనేది ఇంటర్నెట్ ద్వారా నేర్చుకోండి. కంగారు పడకండి. ఒక ప్లాన్ బీ కూడా తయారుగా పెట్టుకోండి అనే మేము చెబుతున్నాం. బిడ్డ పుట్టడానికి ముందూ, ఆ సమయంలోనూ, తరవాతా కూడా మీ స్మార్ట్ ఫోన్ ఎంత ఉపయోగపడగలదో ఆలోచించుకోండి. వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ ద్వారా మీ వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. కొంతమంది డాక్టర్లు వర్చువల్ కన్సల్టేషన్స్ ద్వారా అందుబాటులో ఉంటున్నారు. అది కూడా చెక్ చేస్కుని పెట్టుకోండి.