సోనియాపై విరుచుకుపడిన బిజెపి

రాష్ట్రపతి అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ గురువారం పార్లమెంటు దద్దరిల్లింది. ద్రౌపది ముర్ముని అగౌరవపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బిజెపి సభ్యులు నిరసనకు దిగారు. ‘రాష్ట్రపత్ని’ అంటూ ఆ పదవిని లోక్‌సభ ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి అవమాన పరిచారని, కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలని కేంద్రమంత్రి  స్మృతి ఇరానీ డిమాండ్‌ చేశారు. అత్యున్నత పదవిలో ఉన్న ఒక మహిళను అవమాన పరిచారంటూ మండిపడ్డారు. నిర్మలా సీతారామన్‌ సహా పలువురు బిజెపి మహిళా నేతలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ నాటకీయ పరిణామాలతో గురువారం కూడా ఉభయ సభలు వాయిదా పడ్డాయి.వాయిదా అనంతరం కూడా సోనియా క్షమాపణలు చెప్పాలంటూ బిజెపి నేతలు నినాదాలు చేపట్టారు. అధిర్‌ రంజన్‌ చౌదరి క్షమాపణలు చెప్పారంటూ బిజెపి ఎంపి రమాదేవికి సోనియా వివరిస్తుండగా మధ్యలో స్మృతి ఇరానీ జోక్యం చేసుకున్నారు. దీంతో .. ‘నాతో మాట్లాడొద్దు’అంటూ స్మృతిని సోనియా వారించారు.