మునుగోడులో రేవంత్‌ రెడ్డి కొత్త వ్యూహం

 మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా వివిధ రాజకీయ పార్టీలనేతలు పావులు కదుపుతున్నారు. సీఎం కేసీఆర్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బహిరంగ సభలు ఉండటంతో అధికార తెరాస, బిజెపి ముఖ్య నేతలంతా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మకాం వేశారు. మండలాల వారీగా జనసమీకరణపై స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
పిసిసి చీఫ్‌ రేవంత్‌రెడ్డి సైతం కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపధ్యంలో మునుగోడులో శనివారం పాదయాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఒకే రోజు ఐదు మండలాల్లో పాదయాత్రకు రేవంత్‌ ప్లాన్‌ చేశారు. అదే రోజున మునుగోడు నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో కాంగ్రెస్‌ నేతల పాదయాత్రలు కూడా జరగనున్నాయి. ఈ నెల 21 నుంచి మండలాల వారీగా రేవంత్‌ పర్యటించనున్నారు. మునుగోడులో ఈ నెల 20న సీఎం కేసీఆర్‌ సభ ఉండగా, అదే రోజు రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా 175 మంది కాంగ్రెస్‌ దిగ్గజాలు నియోజకవర్గానికి రానున్నారు.