ఇంగ్లండ్‌తో విజయం అనంతరం రోహిత్ శర్మ కన్నీళ్లు.. విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి..

rohit-28.jpg

ABN , Publish Date – Jun 28 , 2024 | 10:04 AM

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలు సాధించిన టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో టీమిండియాభారీ విజయం సాధించింది. ఈ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. విజయం అనంతరం పెవిలియన్‌లో కూర్చుని కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించాడు. కోహ్లీ అతడిని ఓదార్చడం ఆ వీడియోలో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. దాదాపు పదేళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడనుండడం ఇదే తొలిసారి. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. ఆ మ్యాచ్ ఓటమి తర్వాత చాలా రోజులు నిద్రపోలేదని తెలిపాడు. ఈ నేపథ్యంలో తాజా ప్రపంచకప్‌ సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించినపుడు భావోద్వేగానికి గురయ్యాడు. గత టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియాపై ఇంగ్లండ్ ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌పై గెలవడం కష్టమని రోహిత్‌తో పాటు చాలా మంది భావించారు. సునాయాసంగా ఇంగ్లండ్‌పై విజయం సాధించిన తర్వాత రోహిత్ పెవిలియన్‌లో కూర్చుని ఉన్నాడు. కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు. అదే సమయంలో ఇతర జట్టు సభ్యులతో పాటు కోహ్లీ డగౌట్‌కు వస్తున్నాడు. రోహిత్‌ను చూసి “కమాన్ మ్యాన్ ఛీర్స్“ అంటూ సముదాయించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శనివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడబోతోంది.

Share this post

scroll to top