గాంధీభవన్‌లో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిచారు. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అంటేనే గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.2లక్షల రుణమాఫీ అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనకడుగు వేయబోమని ధీమాగా చెప్పారు. ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేసితీరుతామని భట్టి విక్రమార్క మరోసారి ప్రకటించారు. కాంగ్రెస్‌ను వీడిన నేతలందరినీ తిరిగి ఆహ్వానిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడిన పాతనేతలంతా మళ్లీ పార్టీలోకి తిరిగి రావాలన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భట్టి చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్టు చెప్పారు. భట్టి వ్యాఖ్యలను పీసీసీ చీఫ్‌గా సమర్థిస్తున్నానన్న రేవంత్.. కాంగ్రెస్‌ను వీడిన నేతలంతా తిరిగి రావాలని కోరారు. అందరం కలిసి రాహుల్‌ని ప్రధానిని చేసుకుందామంటూ పిలుపునిచ్చారు. పార్టీవీడిన నేతలకు.. వైఎస్ జయంతి వేడుకలే వేదికగా సీఎం, డిప్యూటీ సీఎంలు వెల్‌కమ్ చెప్పారు. అంతా కలిసి పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు. ఇప్పటికే ఫిరాయింపులు పీక్స్‌లో కొనసాగుతున్న వేళ.. ఇద్దరు కీలక నేతలు చేసిన ఈ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌కు పదునుపెట్టిన కాంగ్రెస్.. మరిన్ని చేరికలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.