ఏపీలో నిన్న జరిగిన వైఎస్‌ఆర్ 75వ జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సభలో సీఎం రేవంత్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ప్రజా సంక్షేమంలో ఆయన తనదైన ముద్ర వేశారని అన్నారు. ఆయన చేసిన అభివృద్ధే తెలంగాణకు శ్రీ రామరక్ష అన్నారు. వైఎస్ఆర్ ఎవరికి ఏ సమస్య వచ్చిన ఆ సమస్యను పరిష్కరించే వారని అన్నారు. రాజకీయాల్లో వైఎస్‌ఆర్ తనదైన శైలిలో ప్రజల మనసుల చురగొన్నారని చెప్పారు. కొత్తగా వచ్చిన వారిని ప్రోత్సహిస్తే పార్టీ మరింత బలపడుతుందని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షమనేదే లేదని వైఎస్‌ఆర్ జయంతి వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక్కడ ఉన్నదంతా పాలకపక్షమే అన్నారు. బీజేపీ అధికారంలో ఉందని..‘బీజేపీ అంటే బాబు, జగన్, పవన్’ అని వీళ్లంతా మోడీ పక్షమేనని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేది వైఎస్ షర్మిల ఒక్కరే అని తేల్చి చెప్పారు. 2029 లో ఆమె ఏపీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం, ఆమె పోరాటం వృధా కాదు అని మంగళగిరిలో జరిగిన సభలో ఆయన వ్యాఖ్యానించారు.