సోమవారం నుంచి తెరుచుకోనున్న ఆలయాలు.. దైవ దర్శనానికి ఈ నిబంధనలు తప్పనిసరి!

లాక్‌డౌన్ కారణంగా దైవదర్శనానికి దూరమైన భక్తులకు ఇది ఒకింత ఊరటనిచ్చే వార్త. రెండున్నర నెలల విరామం తర్వాత సోమవారం నుంచి తెలంగాణలో ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లోకి భక్తులను అనుమతించనున్నారు. జూన్ 8 నుంచి దేవాలయాల్లోకి భక్తుల ప్రవేశానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అందుకు అనుగుణంగానే కంటైన్మెంట్ ఏరియాలు మినహా మిగతా ప్రాంతాల్లో దేవాలయాల్లోకి వెళ్లడానికి భక్తులకు అనుమతి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాకపోతే కొన్నాళ్లపాటు భక్తులకు తీర్థం, ప్రసాదం లాంటివేం ఇవ్వరు. శఠగోపం కూడా పెట్టరు.

దర్శనం కోసం వెళ్లే భక్తులు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, మాస్కులు ధరించడం లాంటి నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. పదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వారిని ఆలయాల్లోకి అనుమతించరు. చెప్పులు విడిచే ప్రాంతంలోనే నీళ్లు, సబ్బు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే ఆలయంలోకి అనుమతి ఇస్తారు. కళ్యాణాలు, అక్షరాభ్యాసాలకూ పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తారు.