ఏపీ ఎన్నికల పోలింగ్ సమయంలో అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. పల్నాడు, అనంతపురం, కడప జిల్లాలతో పాటు చాలా ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ శ్రేణులు కొట్టుకున్నారు. రాళ్లు, కర్రలు, బడిసెలు, రాడ్లుతో పరస్పరం దాడులు చేసుకున్నారు. అంతేకాదు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంతలా శాంతి భద్రతలు క్షీణించడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దాడులకు సంబంధించిన కేసులపై సిట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో సిట్ ఏర్పాటు అయింది.
శనివారం మధ్యాహ్నం నుంచి సిట్ అధికారులు యాక్షన్ షురూ చేయనున్నారు. ఫస్ట్ తిరుపతిలో విచారణ చేపట్టనున్నారు.టీడీపీ అభ్యర్తి పులివర్తి నానిపై జరిగిన దాడి కేసును పరిశీలించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 4 కేంద్రబలగాలు తిరుపతిలో భద్రత చర్యల్లో పాల్గొంటున్నాయి. సమస్యాత్మక గ్రామాల వివరాలు స్టేషన్లవారీగా తెలుసుకున్నారు. ఇప్పటికే పులివర్తి నానిపై జరిగిన దాడికి సంబంధించి తిరుపతి ఎస్పీపై సైతం ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.