ఈరోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. నేడు వరంగల్ పర్యటన ఉన్నా.. తన టూర్ ను వాయిదా వేసుకుని హస్తినలోనే ఉన్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి సహా.. డిప్యూట సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే అనే అంశంపై చర్చించారు. అటు.. ఇప్పటికే పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన ఏఐసీసీ పెద్దలు పలువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. నామినేటెడ్ పోస్టులను త్వరగా భర్తీ చేసే యోచనలో ఉంది. దీంతో పదవులు ఆశిస్తున్న వారంతా ఢిల్లీలోనే పడిగాపులు కాస్తున్నారు. పార్లమెంట్ హాల్లో పార్టీ అధినేత సోనియా గాంధీని మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ వేర్వేరుగా కలిసి తమ మనసులోని మాటను ఆమెకు తెలియజేశారు. ఇక.. హస్తినలోనే ఉన్న ముఖ్య నేతలు ఎవరెవరికి ఏఏ పదవులు ఇవ్వాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. కేబినెట్ లో ఒకేసారి ఆరు మంత్రి పదవులు భర్తీ చేయాలా.. లేదా కొన్నింటిని పెండింగ్ లో ఉంచాలా అన్న దానిపై మంతనాలు సాగుతున్నాయి.