తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. ముగిసిన గవర్నర్ ప్రసంగం.. సభ వాయిదా

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: ముగిసిన గవర్నర్ ప్రసంగం.. సభ వాయిదా

తెలంగాణ శాసనసభ, శాసనమండలి వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బాధ్యతలు చేపట్టాక గవర్నర్ తమిళిసై తొలిసారిగా అసెంబ్లీలో ఉభయసభలనుద్దేశించి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా అందరికీ నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రగతిని తన ప్రసంగంలో గవర్నర్ వివరించారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ అగ్ర పథాన పయనిస్తోందని కొనియాడారు. ‘‘తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలో తీవ్రమైన విద్యుత్ సమస్య ఎదుర్కొంది. తాగునీటికి తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రైతుల ఆత్మహత్యలు, వసలు ఎక్కువగా ఉండేవి. వారు విద్యుత్, సాగునీరు, ఎరువుల పరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, కేసీఆర్ విధానాలు, చర్యల వల్ల వాటన్నింటినీ అధిగమించాం. తక్కువ కాలంలో రాష్ట్రం అగ్రపథాన పయనిస్తోంది. ప్రస్తుతం రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. విత్తనాలు, ఎరువులు సమయానికి అందిస్తున్నాం. నకిలీ ఎరువులను అరికట్టగలిగాం.’’

‘‘తెలంగాణలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు సమర్థమైన విధానాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. టీఎస్ ఐ పాస్ సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు కావాల్సిన అన్ని అనుమతులు కేవలం 15 రోజుల్లోనే ఇస్తున్నాం. దీనివల్ల ఎక్కువ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి వస్తున్నాయి. 12,427 పరిశ్రమలకు టీఎస్ ఐ పాస్ ద్వారా అనుమతులిచ్చాం. తద్వారా రాష్ట్రానికి 2.4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 14 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి ఏర్పడింది.’’

‘‘ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తెలంగాణలోనే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. 2013-14లో రూ.57 వేల కోట్ల ఐటీ ఎగుమతులు ఉండగా, 2018-19లో 1.09 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు ఎగబాకాయి. గతేడాది ఐటీ ఎగుమతుల విషయంలో దేశ వ్యాప్తంగా సరాసరి వృద్ధి రేటు 8.9 శాతం ఉండగా.. తెలంగాణలో మాత్రం 16.89 శాతం నమోదైంది. ఐటీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న ప్రాధాన్యం ఏంటో దీన్ని చూస్తేనే అర్థమవుతుంది.’’ అని గవర్నర్ తమిళిసై ప్రసంగించారు.