శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం ఉదయం నైవేద్యం సమయంలో విశాఖ శారద పీఠం పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు. ముందుగా విశాఖ శారదా పీఠం స్వరూపానంద సరస్వతి స్వామిజీకి ఆలయ మహా ద్వారం వద్ద టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామిజీకి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయ వెలుపల స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జరిగే తరిగొండ వెంగమాంబ జయంతి సందర్భంగా తిరుమలకు రావడం జరిగింది. అలాగే వెంగమాంబ సంకీర్తనలు బయటకు తీయడానికి పూర్తిగా విశాఖ శారద పీఠం సహకరించింది. ఆ రోజుల్లో వెంగమాంబ కీర్తనలను భూమన కరుణాకరరెడ్డి సహకారంతో బయటకు తీశాము. వాటిని గాయకుల దగ్గర కీర్తనలను ఆలపించేలా చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వెంగమాంబ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాగే రాష్ట్ర ప్రజలు అంత ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండాలని స్వామివారిని ప్రార్ధించానన్నారు.