హోలీ వస్తుందంటే చాలు.. దేశమంతా పండుగే. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని హోళికా పుర్ణిమ గా కూడ వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను.. హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ పండుగ పుట్టుపుర్వోత్తరాల గురించి పురాణాల్లో భిన్నగాథలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో చూడండి.
ఇదీ కథ..:
రాక్షస రాజు హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణు మూర్తిని స్మరిస్తుంటాడు. అది హిరణ్యకశపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షస సోదరి హోళికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కొరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. అయితే, విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయపడగా, హోళిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళహోలిక దహనం నిర్వహిస్తారు.