ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యిందని ఈ కాలంలో రాష్ట్రంలో ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని, అభివృద్ధి అంతకంటే లేదని కడప వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, పాలన అనేదే లేకుండా పోయిందన్నారు. వైఎస్ జగన్ గారి హయాంలో వర్షాలకు పంట నష్టం జరిగితే అదే సీజన్లో తమ ప్రభుత్వం పరిహారం అందించిందని, ఇప్పుడు పంట నష్టపోయినా దిక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మాటలు చెప్తున్నారు తప్ప వాస్తవ రూపం లేదని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.
రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ‘కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యింది. ఈ కాలంలో రాష్ట్రంలో ప్రజలకు చేసిన మేలు లేదు, అభివృద్ధి అంతకంటే లేదు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు, పాలన అనేదే లేకుండా పోయింది. వైఎస్ జగన్ గారి హయాంలో వర్షాలకు పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం అందించాం. ఇప్పుడు పంట నష్టపోయినా దిక్కు లేదు. ఎరువులు, విత్తనాలు ఇచ్చే దిక్కు లేదు. ఈ తుఫానుకు వరి తీవ్రంగా నష్టపోయింది. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేదు. వరి కొనుగోలు లేదు, ఇక రంగు మారిన ధాన్యం కొనుగోలుకు దిక్కే లేదు. సీఎం చంద్రబాబు నుంచి అందరూ మాటలు చెప్తున్నారు తప్ప వాస్తవ రూపం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ అధికారులే ఉండటం లేదు’ అని అన్నారు.