పాడేరు నియోజకవర్గం నుంచి మన పార్టీ తరపున ఎన్నికైన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అంతా ఇవాళ ఇక్కడ సమావేశమయ్యాం. పాడేరు నియోజకవర్గంలో దాదాపుగా 85 స్ధానాల్లో ఎన్నికలు జరిగితే మనం 57 స్ధానాల్లో గెలిచాం. మామూలుగా అయితే ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటు నైతిక విలువులు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. కారణం 600కు పైగా స్థానాల్లో మనం గెలిస్తే టీడీపీ వాళ్లు కేవలం 200కు పైగా స్థానాల్లోనే గెల్చారు. వారికి, మనకు దాదాపుగా 387 స్ధానాల తేడా ఉంది.
గెలిచిన వాళ్లు అంతా మన పార్టీ గుర్తు, జెండా మీద గెలిచారు. అలాంటి పరిస్థితుల్లో మెజారిటీ లేనప్పుడు ఎవరైనా పోటీ పెట్టకూడదు. మీ జగనే ఈరోజు ముఖ్యమంత్రి స్ధానంలో ఉండి ఉంటే వాళ్లకు అక్కడ మెజారిటీ ఉండి ఉంటే, మనం పోటీ కూడా పెట్టి ఉండేవాళ్లం కాదు. వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్లకు ప్రజలు ఆ పార్టీ గుర్తును చూసి వారికి ఓట్లేసి గెలిపిస్తే మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం. మన దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయని పోలీసులు, అధికారులు మన చేతిలో ఉన్నారని అధర్మంగానైనా గెలిచే కార్యక్రమం చేస్తే అది ఏ మాత్రం ధర్మం కాదు.
కానీ, ఇక్కడ చంద్రబాబునాయుడు మాత్రం తన నైజం చూపిస్తూనే ఉన్నాడు. ఈ రోజుకి కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపున గెలిచిన వాళ్లకు ఫోన్లు చేసి ప్రలోభపెడుతున్నారు. మనుషులను పంపించిన మరీ మీకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు.