నిన్న నెల్లూరు జిల్లా నేతలతో భేటీ అయిన జగన్, ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నేతలతో భేటీ అయ్యారు. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల వైసీపీ నేతలు ఉన్నారు. వీరితో జిల్లాల వారీగా ఆయన భేటీలు అవుతున్నారు. ఆయా జిల్లాల్లో తాజా పరిస్దితులపై ఆరా తీస్తున్నారు. పార్టీ ఫిరాయించే అవకాశం ఉన్న నేతల్ని గుర్తించాలని, వారి విషయంలో చర్చలు జరపాలని కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ క్లీన్ స్వీప్ అయిపోయిన పరిస్ధితుల్లో ప్రజాప్రతినిధుల కొరత తీవ్రంగా ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను సైతం తాజాగా ఎమ్మెల్సీ చేసి మండలిలో విపక్ష నేతగా నియమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మరికొందరు నేతలు కూడా పక్కచూపులు చూస్తున్నారన్న సమాచారంతో జగన్ అప్రమత్తమయ్యారు. ఆయా జిల్లాల్లో తాజా పరిస్ధితుల్ని సమీక్షించి నేతలకు అవసరమైన సూచనలు చేస్తున్నారు. మరికొన్ని రోజులు ఈ భేటీలు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు జిల్లా అధ్యక్షుల మార్పుల్ని కూడా జగన్ వరుసగా చేపడుతున్నారు.